వేసవి వచ్చిందంటే చాలు కోడుమూరు నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్యలు తప్పడం లేదు. నియోజకవర్గం లోని సి. బెళగల్ మండలం కంబదహల్ (కంపాడు) గ్రామం లోని బిసి కాలనీ వాసులకు తాగునీటి కష్టాలు తీరటం లేదు. ప్రధానంగా ఆ కాలనీలో 100 కుటుంబాలకు తాగునీటి సమస్య వేధిస్తుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో అన్ని కుటుంబాలకు కలపి ఒకే చోట కుళాయి ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం 10 గంటలకు విద్యుత్ రాగానే నీళ్లువస్తున్నాయి. అది కూడా గంటల తరబడి నీటికోసం నిలబడితేనే నీటి అవసరాలు తీరుతున్నాయి.
ఇంటింటి కొళాయి ఏమైందని అడిగితే అధికారులేమో ప్రధాన సమస్యగా అక్కడక్కడా కుళాయిలకు విద్యుత్ మోటార్లు వేసుకోవడం వల్లే ఇక్కడికి నీళ్లు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లుగా చెప్పుకొస్తున్నట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు.
ఈ సమస్య వేసవిలో మరింత తీవ్రతరం అయ్యింది. కాగా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్, నియోజకవర్గం సమన్వయకర్త, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సహాకారాలతో నియోజకవర్గంలో ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. అలాగే ఈ గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కాలనీలో వేసవి వచ్చిందంటే నీటి కష్టాలు తీర్చేవారులేరని వాపోతున్నారు. ఇళ్లకు నీటి అవసరాలు ఎక్కువ కనుక ఒక్కోక్కరు ఒక బిందె నీటికోసం కొళాయి దగ్గరికి వచ్చేసరికి దొరకని కారణంగానే తోపుడు బండ్ల ద్వారా తీసుకొని పోతున్నామని వాపోయారు.
ముఖ్యంగా కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, కర్నూలు రూరల్ మండలాల్లో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నియోజకవర్గం లోని సుంకేసుల జలాశయం, కోడుమూరు సమీపం లోని దామోదరం సంజీవయ్య (గాజులదిన్నె) ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం నీటిని వినియోగిస్తున్నారు.
కాగా, కోడుమూరు నియోజకవర్గం లోని గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ తెలిపారు. మరి బిసి కాలనీ వాసులకు తాగునీటి సమస్యను ఏ మేరకు, ఎప్పుడు పరిష్కారిస్తారో వేచి చూడాల్సిందే..