ఆ యువకుడికి తల్లిదండ్రులు చక్కటి వధువును వెతికి పెళ్లి చేశారు. శృంగారం అంటేనే భయపడే అతడికి స్నేహితులు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు ఏమీ కాదని భరోసానిచ్చారు. అయితే అంతర్లీనంగా ఎంతో ఆందోళన చెందిన అతడు ఫస్ట్‌నైట్‌కు ముందు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకుని భార్యను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేశాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా మాచర్ల సాగర్ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్ (32)కు ఈ నెల 11న తెనాలికి చెందిన యువతితో వివాహం జరిగింది. 12వ తేదీన భార్యను తీసుకుని మాచర్లలోని తన ఇంటికి వెళ్లాడు. నవ దంపతులిద్దరికీ 16వ తేదీన వధువు ఇంట్లో ఫస్ట్ నైట్‌కి ఏర్పాటు చేశారు. అదే రోజు తెనాలి వచ్చేందుకు నవదంపతులు, వధువు కుటుంబ సభ్యులతో పయనమయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరులో బస్సు దిగగానే ఇప్పుడే వస్తానంటూ కిరణ్ వెళ్లిపోయాడు.
రాత్రైనా బస్టాండ్‌లోనే వారు వేచి చూశారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో కిరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే కృష్ణానది ఎగువ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు ఇటీవల సమాచారం అందింది. వారు వెళ్లి మృతదేహం వద్ద ఉన్న ఫోన్‌లోని సిమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కిరణ్ కుటుంబ సభ్యుల నంబర్లకు సమాచారం అందించారు. కిరణ్ తల్లి వచ్చి, మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించి బోరున విలపించింది. ఫస్ట్ నైట్ అంటే భయంతోనే ఇలా చేశాడని ఆమె తెలిపింది. దీంతో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.