నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేంత వరకు ఐక్యంగా పోరాడుదామని సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ అన్నారు
గణేనాయక్ భవన్‌లో సిపిఎం నగర 1వ కమిటీ జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఆ కమిటీ నగర కార్యదర్శి వి. రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ హాజరై మాట్లాడారు. కేరళలో ఇటీవల జరిగిన సిపిఎం అఖిల భారత మహాసభల తీర్మాణాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు అంశాలపై వివరించారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పోరాటాలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్‌టిసి ఛార్జీలు పెంచి భారాలు వేస్తోందన్నారు. తక్షణమే పెంచిన ఛార్జీలు ఉప సంహరించాలన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందుతున్న నిత్యావసర సరుకులు దూరం చేసి నగదు బదిలీ పథకం తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు నష్టం జరగుతుందని, దీనిని ఉప సంహరించుకుని యథావిధిగా 9 రకాల సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం పోరాటాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముస్కిన్, నగర నాయకులు ప్రకాష్, వెంకటేష్, ప్రసాద్, రాజేశ్వరి, రాజు, రమీజాబి, గపూర్ పాల్గొన్నారు.