ఐపీఎల్ 2022లో మరో హోరాహోరీ పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్రికెట్ యుద్ధం జరగబోతుంది.ఈ సీజన్లో ఇరు జట్లు తొలిసారిగా తలపడనున్నాయి. ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడిన ఢిల్లీ రెండు విజయాలు, మూడు ఓటములతో 4 పాయింట్లు సాదించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. అటు పంజాబ్ కింగ్స్ 6 మ్యాచుల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
గత మ్యాచుల్లో రెండు జట్లు ఓడిపోయాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పొందగా, ఢిల్లీ , బెంగుళూరు చేతిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ గేమ్ ఎంతో ముఖ్యమైనది. ప్లే ఆఫ్ లో స్తానం దక్కించుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ ఇంపార్టెంట్. దీంతో పంజాబ్ పై గెలవాలని ఢిల్లీ, ఢిల్లీపై నెగ్గాలని పంజాబ్ ఓ రేంజ్ లో ప్లాన్స్ వేస్తున్నాయి.
ఢిల్లీ జట్టులో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తారు. ఆ తర్వాత యశ్ ధుల్, రిషబ్ పంత్ , రోవ్‌మన్ పావెల్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగుతారు. లోయర్ ఆర్డర్ లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ రావడం ఖాయం. బౌలింగ్ లైనప్ లో
కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం పక్కా.
అటు పంజాబ్ కింగ్స్ లో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. వన్ డౌన్ లో జానీ బెయిర్‌స్టో, నాల్గో స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్,అనంతరం జితేష్ శర్మ బ్యాటింగ్ చేస్తారు. లోయర్ ఆర్డర్ లో షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ తమ బంతులతో ఢిల్లీని బెంబేలెత్తించేందుకు సిద్దమయ్యారు.
ఇరు జట్లు ఆడిన గత మూడు మ్యాచులను పరిశీలిస్తే, ఢిల్లీ ఓపెనర్లు 259 పరుగులు సాధించారు. కానీ పంజాబ్ ఓపెనర్లు 184 మాత్రమే చేయగలిగారు. ఈ లెక్కల ప్రకారం ఢిల్లీ ఓపెనింగ్ విభాగంలో కొద్దిగా బలంగా ఉందని చెప్పొచ్చు.
మిడిలార్డర్ లో ఢిల్లీ 162 రన్స్ సాధిస్తే, పంజాబ్ 212 పరుగులు చేశారు. దీని ప్రకారం పంజాబ్ ఢిల్లీ కంటే బెటర్ గా కనిపిస్తోంది. అటు లోయర్ ఆర్డర్ లో ఢిల్లీ 79 పరుగులు, పంజాబ్ 71 పరుగులు చేశాయి. అయితే మూడు మ్యాచుల్లో రెండు జట్లకు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువ వచ్చింది. ఇక బౌలింగ్ లో పంజాబ్ 16 వికెట్లు పడగొడితే, ఢిల్లీ 19 వికెట్లను దక్కించుకుంది. ఈ విభాగంలో కొద్దిగా ఢిల్లీకే ఎడ్జ్ కనిపిస్తోంది. అల్ రౌండర్లు, మంచి స్పిన్నర్లు ఢిల్లీ సొంతం.
ఇక ఢిల్లీ జట్టులో కరోనా కలకలం రేపింది. కరోన కారణంగా మిచెల్ మార్ష్ జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో యశ్ దుల్ జట్టులోకి వచ్చాడు. అయితే జట్టు పరంగా బలంగా కనిపిస్తున్నా, మైదానంలో మాత్రం రిషబ్ పంత్ టీమ్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. అటు గత మ్యాచ్ కు దూరమైన పంజాబ్ కెప్టెన్ మయాంక్, ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనుండటం జట్టుకు ప్లస్ పాయింట్. సగం విజయాలు, సగం పరాజయాలతో సీజన్ ను కంటిన్యూ చేస్తున్న పంజాబ్ కింగ్స్ , ఈ మ్యాచ్ లో ఎలా అడుతుందనేది ఆసక్తికరం.
ఇరు జట్లు ఇప్పటి వరకు 28 మ్యాచులు ఆడాయి. ఇందులో పంజాబ్ 15, ఢిల్లీ 13 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య అత్యధిక స్కోరు 231, అత్యల్ప స్కోర్ 67 పరుగులు. కరోన కారణంగా ఈ మ్యాచ్ వేదిక మారింది. పూణె నుంచి బ్రబౌర్న్ స్టేడియంకు మ్యాచ్ ను తరలించారు. ఈ నేపథ్యంలో బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గేమ్ స్టార్ట్ కానుంది.
బ్రబౌర్న్ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరికీ సహకరిస్తుంది. షార్ట్ బౌండరీలు, వేగవంతమైన ఔట్ ఫీల్డ్ వల్ల బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ ను థ్రిల్ గా ఫీలవుతూ పరుగులు సాధిస్తారు.
ఈ పిచ్ పై 14 మ్యాచులు జరిగితే ఎనిమిదింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, మరో ఆరింటిలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ సీజన్ లో ఏడు మ్యాచులు జరగ్గా, మూడు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన టీమే గెలిచింది. అత్యధిక స్కోరు 217 కాగా, అత్యల్ప స్కోరు 115. అవరేజ్ స్కోరు 186 పరుగులు. మంచు ప్రభావం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. గణాంకాలు, జట్ల బలాబలాలు పరిశీలిస్తే ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో అభిమానులకు ఈ మ్యాచ్ అసలైన క్రికెట్ విందును ఇచ్చే అవకాశం ఉంది.