భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019 తర్వాత తొలిసారి జమ్మూలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనకు 48 గంటల ముందు అక్కడ భారీ ఉగ్ర దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో అక్కడ భారీ ఎన్‌కౌంటర్ మొదలైంది. జమ్మూలో ఓ సైనిక చెక్‌పోస్టు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఒక సీఐఎస్‌ఎఫ్ అధికారి కూడా చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూ లో ఉగ్రదాడి జరగొచ్చని 21వ తేదీన ఆర్మీకి సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ బలగాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సును తరలిస్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చనిపోగా, ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఉన్నారు.
జవాన్ల ఎదురుదాడిలో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహమ్మద్ గ్రూపునకు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబ కమాండర్ యూసఫ్ కంత్రూ కూడా ఉన్నట్లు సమాచారం.