ఓ వ్యక్తికి హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ విభాగంలో వైద్య సేవలందించిన ఆసుపత్రి వైద్యులు మరుసటి రోడు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి, అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా, అకస్మాత్తుగా పాడె మీద నుంచి లేచాడు. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే విషాదం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధార్‌లో సంతోష్ (52) అనే వ్యక్తికి మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆయనకు ఆసుపత్రి వర్గాలు చికిత్స అందించాయి. బుధవారం పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో నీరు నిండిన కళ్లతో అతడి కుటుంబ సభ్యులు సంతోష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేశారు. అంత్యక్రియలకు సిద్ధమై పాడెపై శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. ఇంతలో సంతోష్ ఒక్కసారిగా దగ్గుతూ పైకి లేచాడు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వెంటనే అతడికి తాగడానికి నీరు అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదనడంతో మరో ఆసుప్రతికి హుటాహుటిన తరలించారు. అయితే అక్కడకు వెళ్లేలోపే మార్గమధ్యంలో సంతోష్ మృతి చెందాడు. దీంతో అతడికి మొదటి సారి వైద్యం అందించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.