ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లో కరోనా కలకలం రేపుతోంది. తమిళనాడులోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.ఐఐటీ క్యాంపస్‌లో ఇప్పటికే 12 మందికి కరోనా పాజిటివ్ నమోదు కాగా.. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 22) మరో 18మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో క్యాంపస్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మిగిలిన విద్యార్థులందరికి కరోనా టెస్టులు నిర్వహించాలని ఐఐటీ అధికారులు నిర్ణయించారు.
కరోనా పరీక్షలకు సంబంధించి ఫలితాలు వస్తే.. అందులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఐఐటీ క్యాంపస్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. తమిళనాడు రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే 31 వరకు కరోనా కేసులు పెరిగాయి. కరోనా కేసుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించకుండా ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలను తప్పక పాటించాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.