ఛార్జింగి పెట్టి ల్యాప్ ట్యాప్ వాడుతుండగా అది పేలిన ఘటనలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాయాల పాలైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచింది. ఏపీలోని కడప జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లె గ్రామానికి చెందిన సుమలత(22) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో తన ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ అయిపోవడం గమనించింది. వెంటనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టేందుకు వైర్‌ను స్విచ్‌బోర్డుకు అనుసంధానం చేసింది. ఛార్జింగ్ పెడుతూ వర్క్ చేస్తున్న క్రమంలో ల్యాప్‌టాప్ హీట్ ఎక్కింది. ఆమె తేరుకునేలోపే ఒక్కసారిగా పేలిపోయింది. ఒడిలో పెట్టుకుని పని చేస్తున్న సుమలతకు తీవ్ర గాయాలయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో కడప సన్ రైజ్ ఆసుపత్రిలో చేరింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.