విజయవాడ అత్యాచార బాధితురాలిని ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, జోగి రమేశ్.. రూ.10లక్షల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామన్న భరోసా ఇచ్చిన వారు.. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అటు ఈ ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.
పరామర్శ అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. "బాధితులు దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అది కోర్టు పరిధిలో ఉంటుంది. దిశ చట్టం అమల్లో ఉంటే బాధితులకు 24 గంటల్లో న్యాయం జరిగేది. కానీ అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీఎం గారు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇప్పుడు చెక్ అందించాం. బాధితులు ఇళ్ల లేదని వేడుకున్నారు. ఇందుకు మంత్రి జోగి రమేష్ స్పందించి ప్రభుత్వం తరఫున ఇళ్లు కేటాయిస్తామన్నారు" అని అన్నారు.
యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.