ఇటీవల కాలంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. కాంగ్రెస్‌లో ఆయన చేరుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మే 7న ముహూర్తం కూడా పెట్టేశారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేతలను తరచూ కలుస్తున్న ఆయన కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అందులో వివిధ రాష్ట్రాలలో కొన్ని పార్టీలో పొత్తుల గురించి ఉన్నట్లు తెలస్తోంది.
ఏపీలో వైసీపీతో పొత్తు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ అంశాన్ని మీడియా ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ వద్ద ప్రతిపాదించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు కొన్ని స్ట్రాటజీలు చెబుతారని, అయితే వాటిని అమలు చేయాలా వద్దా అనేది ఆయా పార్టీల అధ్యక్షుల నిర్ణయమని చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ తాము చేస్తామనే ఆలోచన విడనాడాలన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వైసీపీని వైఎస్ జగన్ స్థాపించారని, అలాంటిది తిరిగి ఆ పార్టీతో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. మరోవైపు ఈ అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకే వైసీపీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వివరించారు.