ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్న నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తాడిపత్రి డిఎస్పి కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గుత్తి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండో విడత పరివర్తన కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో తాము సెబ్ అధికారులు సమన్వయంతో ప్రత్యేక దాడులు నిర్వహించామని చెప్పారు.
యాడికిలో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తండాకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో సారా తరలిస్తుండగా దాడి చేశామన్నారు. వంద లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. పామిడి మండలం రామగిరి దిగువ తండాలో నాటుసారా స్థావరంపై దాడి చేసి 3400 లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేసి పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామ న్నారు. మూడు సార్లు ఎక్సైజ్ కేసులు నమోదు అయిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరిం చారు.
గుత్తి మండలంలోని జక్కలచెరువు చెందిన ఇద్దరు నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. నాటు సారా తయారీ దారులు, విక్రేతలకు వారి కార్యకలాపాలు విరమించుకుంటే ప్రభుత్వం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఎఇఎస్ వెంకటే శ్వర్లు, సివిల్ సీఐ పి. శ్యామ రావు, ఎస్సై మురహరి బాబు, సెబ్ సిఐ బి. వరలక్ష్మి, ఎస్సై మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.