వైకాపా ఎత్తులు ఊహలకు అందవని మరోమారు రుజువైంది. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో.. ఎవరిని దింపుతారో అంచనా వేయడం కష్టమే. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆ పార్టీ నూతన అధ్యక్షులతో పాటు పార్టీ సమన్వయ కర్తల నియామకంలో ఇది అక్షరాల రుజువైంది. ఇంతకీ ముఖ్యమంత్రి జగన్ లెక్కలలో కిక్కు ఎక్కిస్తున్న లెక్క ఏమిటంటే పార్టీ బాధ్యతల పంపకం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అటు ప్రభుత్వ పరంగానూ, ఇటు పార్టీ పరంగానూ ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు జిల్లాలకు ఇన్ చార్జీ మంత్రుల నియామకం, పార్టీ బాధ్యతలు అప్పగింతలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.
పార్టీని క్రియాశీలకంగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. అందరికీ స్వేచ్చను, అధికారాన్ని ఇస్తున్నట్లు ఇస్తూనే మరో పక్క వారి దూకుడికి కళ్లెం వేసే జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం కర్నూలు జిల్లా వైకాపా అధ్యక్షులుగా మంత్రాలయం ఎమ్యెల్యే బాల నాగిరెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షునిగా పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలను నియమించడమే. 2024 ఎన్నికల క్రమంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో వైకాపా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పార్టీలో సీనియర్ ఎమ్యెల్యేలు అయిన వీరు ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చోటుకోసం చివరి వరకు యత్నించారు. అయితే వీరికి నిరాశ తప్పలేదు.
వాస్తవంగా కొత్త ముఖాలతో మంత్రి వర్గం కొలువు తీరుతుందని తొలుత ప్రచారం సాగించినా చివరి క్షణంలో కొంత మేరకు సడలించారు. కొద్ది మంది సీనియర్లను మంత్రులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించగా, ఆ సీనియర్ల జాబితాలో కర్నూలు, నంద్యాల
జిల్లాలకు చెందిన గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు తిరిగి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. కులాల సమీకరణలో గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవి ఖాయపరిచినట్లు అధిష్టానం లెక్క చెప్పింది. ఇక గుమ్మనూరు, బుగ్గనకు మంత్రి పదవులు ఇచ్చినా శాఖల కేటాయింపు దగ్గరకి వచ్చే సరికి మరో చర్చకు తావిచ్చేటట్లు వ్యవహారించింది.
తిరిగి ఎవరి శాఖలు వారికి కట్టబెట్టింది. దీంతో తిరిగి పాతవారికే మంత్రి పదవులు కట్టబెట్టడంతో అటు నంద్యాల, ఇటు కర్నూలు జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలకు అసంతృప్తి తప్పలేదు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో చివరి వరకు పదవి ఆశించి నిరాశకు గురైన ముగ్గరు సోదరులలో ఒకరైన బాలనాగిరెడ్డికి కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టగా, ఇక నంద్యాల పార్టీ బాధ్యతలను కాటసాని రాంభూపాల్ రెడ్డికి కట్టబెట్టడం గమనార్హం. దీన్ని బట్టి కర్నూలు జిల్లాలో పార్టీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్
కర్నూలు, నంద్యాల వైకాపా జిల్లా అధ్యక్ష పదవులు కాటసాని, బాలనాగిరెడ్డికి కట్టబెడుతూనే మరోవైపు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బుగ్గనను, నంద్యాల జిల్లాకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ ఖానను నియమించారు. అంతేకాదు పార్టీ సమన్వయ బాధ్యతలను బుగ్గన, సజ్జలకు అప్పగించడం కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ రెండు జిల్లాలలో తనదైన మార్కును చూపించినట్లైంది. ఈ నియామకాన్ని పరిశీలిస్తే పార్టీ నేతల జాగ్రత్త కళ్లకు అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ విషయం నంద్యాల, కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
నూతన సారథుల నియామకంతో పార్టీలో అంతర్గత కలహాలకు చెక్ పడేనా..
పార్టీ ప్రకాళనతో పాటు వచ్చే ఎన్నికలకు టీంను సిద్ధం చేసుకునే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రక్షాళనకు సిద్ధపడింది. ఇందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆ పార్టీ నూతన అధ్యక్షులుగా బాలనాగిరెడ్డి, - కాటసాని రాంభూపాల్ రెడ్డిలను నియమించింది. అయితే వీరి రాకతో పార్టీ లో జవసత్వాలు నెలకొంటాయా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగదాలు అధికంగా ఉండటమే.
ముఖ్యంగా నంద్యాల జిల్లా పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో శాప్ క్రీడా ఛైర్మన్, నందికొట్కూరు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి బైరెడ్డి సిద్ధార్దరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అర్ధర్ మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమంటోంది. ఆ మధ్య మిడుతూరు మండలం నాగలూటిలో ఎమ్మెల్యే ఆర్డర్ లేకుండానే అప్పటి ఇన్‌ఛార్జి మంత్రితో కలిసి ప్రారంబోత్సవాలు చేశారు. వీటిపై పార్టీలో వివాదం రేగడంతో పాటు వైసీపీలో పెద్ద పంచాయితీకే దారి తీసింది.
ఈ ఘటన తర్వాత వైసీపీలో సిద్ధార్దారెడ్డి చురుకైనా పాత్ర పోషించడం లేదన్న గుసగుసలు వినిపించాయి. ఒకానొక దశలో ఆయన పార్టీ వీడి టీడీపీకి వెళతారనే ప్రచారం జోరందుకోగా, వాటిని కాదని సిద్ధార్థరెడ్డి ఖండించాల్సివచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో గ్రహించవచ్చు. మరి బైరెడ్డి, అర్డర్ మధ్య ఉన్న అంతర్గత కలహాలను నూతన పార్టీ అధ్యక్షులు కాటసాని ఎలా రూపుమాపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అలాగే కర్నూలు జిల్లాను పరిగణలోకి తీసుకుంటే కోడుమూరు నియోజకవర్గంలోను పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు మాజీ ఎమ్యెల్యే టీటీడీ పాలక వర్గ సభ్యులు మురళీకృష్ణ, మాజీ ఎమ్యెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇంచార్టీ కోట్ల వంశీధర్ రెడ్డిల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీలోని ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కార్యకర్తలు నలిగిపోతున్నారు.
మరి ఈ పరిస్థితుల్లో కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులైన బాలనాగిరెడ్డి వీరి మధ్య సఖ్యత కుదర్చగలరా అన్న అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు పత్తికొండ నియోజకవర్గం వైకాపాలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయి. వీటిని చక్కదిద్దకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మిగనూరులో సైతం ఇదే పరిస్థితులున్నాయి. వీటని నూతన సారథి బాలనాగిరెడ్డి ఎలా అధిగమిస్తారన్నది ప్రస్తుతం భేతాళ ప్రశ్నే.