చనిపోయిన వ్యక్తుల పట్ల మానవీయతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు విలువలు మరిచారు. ఆసుపత్రిలో అంబులెన్స్ సిబ్బంది మాఫియాతో కారణంగా బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రి భుజాలపై మోసుకెళ్లాడు. నీరు నిండిన కళ్లతో ఆ తర్వాత బైక్‌పై 90 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరారు. ఈ అమానుష సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని తిరుపతి రుయా ఆసుప్రతి వద్ద ఉచిత అంబులెన్సు మూలన పడింది. దీంతో ఆసుపత్రికి వచ్చీపోయే రోగులను సొంత వాహనాల్లో తరలిస్తున్నారు. అక్కడ ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు సిండికేట్‌గా ఏర్పడ్డారు. సాధారణ అంబులెన్స్‌కు ఒక రేటు, ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్‌కు మరో రేటు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని రుయాలో చేర్చారు. కిడ్నీలు ఫెయిలై ఆ బాలుడు మంగళవారం ఉదయం మరణించాడు. ఎంతో వేదనతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు బాలుడి తండ్రి చేరవేశాడు. ఈ తరుణంలో మృతదేహాన్ని తరలించడానికి అక్కడి ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు భారీ మొత్తం డిమాండ్ చేశారు.
వారు అడిగిన రూ.20 వేల మొత్తం తన వద్ద లేవని ఆ తండ్రి ప్రాధేయపడినా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ముఠా ఒప్పుకోలేదు. దీంతో బంధువులు వేరే ప్రైవేట్ అంబులెన్సును పంపించారు. ఆ అంబులెన్స్ డ్రైవర్‌ను స్థానిక అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. అంతేకాకుండా అతడిని కొట్టి బయటకు పంపేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ బాలుడి తండ్రి కన్నీటి పర్యంతమై, తన కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకున్నాడు. బైక్‌పై కూర్చుని 90 కి.మీ. దూరం ప్రయాణించి స్వగ్రామానికి తీవ్ర వేదనతో చేరుకున్నాడు.