ఏపీలో రోజు వారీ కరోనా కేసుల నమోదులో సోమవారం అరుదైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఒక్క కొవిడ్ కేసు కూడా సోమవారం నమోదు అవలేదు. కరోనా విజృంభించడం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రోజు వారీ కరోనా కేసులు 'సున్నా'గా నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ప్రజల్లో సంతోషం నెలకొంది. ఏపీలో 2020 మార్చి 9న తొలి కరోనా కేసు వెలుగు చూసింది. అయితే అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 12, 2020న నమోదనట్లు చూపించారు. మొదటి, రెండవ, మూడవ వేవ్‌లలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో ఒక్క రోజులో 24 వేల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో గత 24 గంటల్లో 2163 శాంపిళ్లను పరీక్షించగా, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదవలేదని సోమవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 23,19,662 మంది ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కేవలం 22 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కాలంలో కరోనా ప్రభావం రాష్ట్రంలో గణనీయంగా తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. వారం క్రితం 25 జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా రాష్ట్రం మొత్తం ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది.