సభ్యసమాజం తలదించుకునే రీతిలో కొందరు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైందంటూ యువతిని కిడ్నాప్ చేశారు. సామూహిక అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ ఆగ్రహం చల్లారకపోవడంతో జుట్టు కత్తిరించి, ముఖానికి నల్ల రంగు పూసి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా ఊరంతా అవమానకరంగా ఊరేగించారు. జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌కు చెందిన యువకుడు ప్రేమ పేరిట బాధిత యువతి వెంట పడేవాడు. అతడి ప్రేమను తిరస్కరించినా, వెంట పడుతూ వేధించేవాడు. దీంతో ఆమె అతడి ప్రేమను ఒప్పుకునేది లేదని స్పష్టంగా చెప్పింది. ఇది తట్టుకోలేని ఆ యువకుడు జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు కుటుంబ సభ్యులు, బంధువులు దీనికి కారణం బాధిత యువతేనని కక్ష పెంచుకున్నారు. ఆమెను జనవరిలోనే కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. మెడలో చెప్పుల దండ వేసి, ముఖానికి నల్లరంగు పూసి ఊరేగించారు.
దీనిపై బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసుకు సంబంధించి ఛార్జిషీట్లను సోమవారం కోర్టులో పోలీసులు సమర్పించారు. కేసులో ఐదుగురు చిన్నారులతో సహా, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను నిందితులుగా పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం, ఊరేగింపునకు సంబంధించిన 26 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 12 వీడియోలను నిందితులు సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.