ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు సైనిక చర్యను ప్రారంభించిన రష్యాకు తొలి నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. 55 రోజులు దాటినా బలమైన రష్యాకు తలొగ్గేందుకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రష్యా తాజాగా తీవ్ర హెచ్చరికలు చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తాజాగా తమ దేశంలోని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు యుద్ధం ముందు ఉందని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లు భావిస్తున్నామని గట్టి హెచ్చరికలు పంపింది. శాంతి చర్చల విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. రష్యా తాజా వ్యాఖ్యలతో అణుబాంబులు కూడా వేయొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఉక్రెయిన్‌కు అమెరికా బాసటగా నిలుస్తోంది. 700 మిలియన్ల విలువైన సైనిక సామగ్రి, యుద్ధ సామగ్రిని అందిస్తోంది. ఇతర దేశాలు కూడా ఫైటర్ జెట్లు, యుద్ధ సామగ్రిని ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఈ పరిణామాలపై కూడా రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉక్రెయిన్ తాజా పరిస్థితికి ప్రధాన కారణం అమెరికా, పశ్చిమ దేశాలనని ఆరోపిస్తోంది. యుద్ధానికి ఆ దేశాన్ని పశ్చిమ దేశాలు ఎగదోశాయని రష్యా చెబుతోంది. పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్ మరిన్ని ఆయుధాలు సమకూర్చుకుంటే తమ ఆగ్రహం చవిచూడాల్సి పరిస్థితి వస్తుందని ఉక్రెయిన్‌ను రష్యా హెచ్చరించింది.