సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, విజయమ్మలపై ఎవరైనా అవాకులు, చెవాకులు పేలితో సహించేది లేదని ఏపీ మంత్రి రోజా స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోందని, బాధితులకు అండగా నిలబడుతోందని చెప్పారు. అయితే అత్యాచార ఘటనలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీని 254 ఎమ్మెల్యే స్థానాల నుంచి 23కు దిగజార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇక ఏ ఎన్నికలైనా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తారని చెప్పారు. సొంత కొడుకును ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేని చంద్రబాబు చీర కట్టుకోవాలని సూచించారు.
కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలను నేరుగా అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అలాంటి నేతపై విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదన్నారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని, వచ్చే ఎన్నికల్లో అధికారమే ఆయన కోరుకుంటున్నారని అన్నారు. ఇక చంద్రబాబును ఉన్మాదిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చెప్పుకోదగ్గ స్థానాలను కూడా గెలవలేదన్నారు. మరోవైపు టీడీపీ నేతలు బూతు పురాణాలను మీడియాలో ప్రసారం చేయొద్దని కోరారు.