చైనాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా ఆ దేశ వాణిజ్య నగరం షాంఘైలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఆ ఒక్క నగరంలోనే కరోనా బారిన పడి 50 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ వైరస్ మానవులకు సోకడం ఆ దేశంలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.
హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన బాధిత బాలుడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ బాలుడికి జ్వరం ఇతర అస్వస్థతలు తలెత్తినట్లు పేర్కొన్నారు. అతడి నుంచి నమూనాలు సేకరించగా, బర్డ్ ఫ్లూకి చెందిన హెచ్3ఎన్8 రకం వెలుగు చూసిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అప్రమత్తమైంది.
బర్డ్ ఫ్లూ వచ్చిన బాలుడికి అందించే వైద్య సేవలను చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పరిశీలిస్తోంది. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇది ఇతరులకు సోకే అవకాశం చాలా స్వల్పమని వివరించింది. తాజాగా బాధిత బాలుడితో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. బాధిత చిన్నారి ఇంట్లో కోళ్లు, కాకులను పెంచుకుంటున్నారని, వాటి ద్వారా వ్యాధి సంక్రమించినట్లు భావిస్తున్నట్లు తెలిపింది.