పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్‌బాషా ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్‌లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయిప్రవీణ్ చంద్, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు.