పాకిస్థాన్ లోని కరాచీ యూనివర్సిటీలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. బలూచిస్తాన్ లో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఆమె దాడికి పాల్పడింది. అయితే ఈ ఘటన తర్వాత ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కరాచీలో జరిగిన దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు మొత్తం నలుగురు చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
హ్యూమన్ బాంబర్‌గా మారిన ఆ మహిళను టర్బత్‌లోని నియాజర్ అబాద్‌కు చెందిన షరీ బలోచ్ (30) గా గుర్తించారు. జువాలజీలో ఎంఎస్సీ చేసిన ఆమె ఎంఫిల్ చేస్తూ సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఓ డాక్టర్‌ని వివాహం చేసుకుంది. ఆయన పేరు హబిటన్ బషీర్ బలోచ్. అతను ఓ డెంటిస్ట్. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షరీ బలోచ్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి.
షరీ బలోచ్ రెండేళ్ల క్రితమే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బిగ్రేడ్ ఆత్మ బలిదాన దళంలో చేరింది. షరి మిలిటెంట్ గ్రూప్‌లో ఆమె తొలి మహిళా బాంబర్ అని తెలిసింది. ఈ రెండేళ్లలో షరి బలోచ్ మజీ బిగ్రేడ్‌లోని వేర్వేరు యూనిట్లలో ఆమె పనిచేసింది. 6 నెలల క్రితం తాను ఆత్మబలిదాన దాడికి కట్టుబడి ఉన్నానని ఆమె ధ్రువీకరించిందని, ఆ తర్వాత ఆమె మిషన్‌లో పాల్గొందని బీఎల్‌ఏ పేర్కొంది.
షరీ బలోచ్ చేసిన ఆత్మాహుతి దాడిపై ఆమె భర్త స్పందించారు. ఆమెను పొగుడుతూ ట్వీట్ చేశారు. తన నిస్వార్థ చర్యతో గర్వపడుతున్నానని, తమ తల్లి ఎంత గొప్పదని ఆలోచిస్తూ తమ పిల్లలు గర్వించదగిన వ్యక్తులుగా ఎదుగుతారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యులైన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించింది. తమ దేశస్థులకు భద్రత కల్పించాలని పాకిస్థాన్ ను కోరింది.