ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు జరిగిన ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ప్రశ్నపత్రం లీక్ కాలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. అంకిరెడ్డిపల్లెలో ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభం అయ్యిందని చెప్పారు. 11గంటలకు ప్రశ్నపత్రం ఫొటో సోషల్ మీడియాలో వచ్చిందని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్ వైజర్, ఇన్విజిలేటర్ పై కూడా చర్యలు తీసుకుంటామని సురేశ్ కుమార్ తెలిపారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రచారం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డీఈవో పురుషోత్తం తెలిపారు. ప్రశ్నాపత్రం లీక్ వార్తలు, తప్పుడు ప్రచారాలు నమ్మెద్దని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ అంటూ వదంతులు సృష్టించిన వారిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ, విద్యా శాఖ విచారణ చేపడుతోందని తెలిపారు.