అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత నాది, రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదు. సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చాం. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతాం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
16 నెలల క్రితమే ఈ కార్యక్రమం జరగాల్సింది. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు, నాకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టింది. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చాం. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది.