ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు అవమానం జరిగింది. ఒడిస్సీ నృత్యకారుడైన 90 ఏళ్ల గురు మయధర్ రౌత్ గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. అయితే గురువారం ఆ ఇంటిని ఖాళీ చేయించి ఆయనను నడి రోడ్డుపై నిలబెట్టారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గురు మయధర్ రౌత్ తో పాటు పలువురు ప్రముఖ కళాకారులకు చాలా ఏళ్ల క్రితమే అక్కడ వసతులు కేటాయించారు. అయితే 2014లో వీటిని రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించారు. కానీ ఫలితం లేదు. వీరిలో చాలా మంది ఇప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఏప్రిల్ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయధర్ రౌత్ వెళ్లకపోవడంతో అధికారులే స్వయంగా వచ్చి ఖాళీ చేయించారు.
అధికారులు తీరుపై మయధర్ కుమార్తె మధుమితా రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాట్యంతో ఎన్నో సేవలందించిన మయధర్ కు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని వాపోయారు. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు.