హత్యాచారం ఘటన మరువక ముందే అదే మండలంలో మరో అత్యాచార ప్రయత్న ఘటన చోటుచేసుకోవడం కలకలాన్ని సృష్టిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. శృంగారపురం గ్రామంలోని తిరుపతమ్మ ఆలయం వద్ద నిద్రిస్తున్న ఓ మహిళ పై కొంతమంది యువకులు అత్యాచార యత్నం చేశారు. పొలాల్లోకి మహిళను బలవంతంగా లాక్కెళ్లారు. కూలి పనుల కోసం గ్రామానికి వచ్చిన మహిళ అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పై కన్నేసిన కొంతమంది యువకులు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు.
దీంతో బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు వారు తెచ్చిన ద్విచక్ర వాహనం సైతం అక్కడే వదిలేసి పారిపోయారు. డయల్ 100 ద్వారా కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న దుగ్గిరాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు వదిలిపెట్టిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.