తనపై టీడీపీకి చెందిన నాయకులే దాడి చేశారని ఏపీలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. శనివారం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో తమ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తెలిసి, అక్కడకు వెళ్లానన్నారు. పరామర్శకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు గ్రామస్తులతో కలిసి దాడికి యత్నించారన్నారు. ఎవరి వల్ల వారు తనపై దాడికి పాల్పడ్డారో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజమండ్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెళ్లి పరామర్శించారు. హోంమంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించారు. హత్య కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారని చెప్పారు.
మరోవైపు తన భర్త గంజి ప్రసాద్ హత్య కేసులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రమేయం ఉందని సత్యవతి ఆరోపించింది. తమకు న్యాయం చేసేంత వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని చెప్పింది. గ్రామ వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయన్నారు. తన భర్తకు వ్యతిరేకంగా ఉన్న ఎంపీటీసీ బజారియాను ఎమ్మెల్యే ప్రోత్సహించారన్నారు. తన భర్తను ఇటీవల పోలీసులు స్టేషన్‌కు పిలిపించారని, దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.