సమ్మర్ లో వేడితో పాటు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను దీటుగా ఎదుర్కొనేలా శరీరాన్ని తయారు చేసుకోవాలి. అందుకోసం వేసవిలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- వేసవిలో కర్బూజ తినడం మంచిది. పోషకాలతో పాటు శరీరానికి కావాల్సిన నీటిని ఇది అందిస్తుంది. ఇది తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండులో ఉండే ఫైబర్, విటమిన్ సి, బి6 ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
- బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీ, నిమ్మ, పుచ్చకాయల్లో బీటా కెరోటిన్, సి, ఇ, కె విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి.
- సోర, బెండ, తోటకూర, పుదీనాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి త్వరగా అరుగుతాయి. శరీరానికి చల్లదనాన్నిస్తాయి. టొమాటోలో లైకోపిన్ ఉంటుంది. ఇది ఎండ నుంచి రక్షణనిస్తుంది. క్యాబేజ్, కీర, దోస వంటి వాటిల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరాన్ని చల్లబరుస్తాయి.
- నీరు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. దీంతో అలర్జీలు దరిచేరవు. అదనంగా పెరుగు, మజ్జిగ మొదలైనవి చేర్చుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.