బనగానపల్లె నియోజకవర్గం పరిధిలో పది పబ్లిక్ పరీక్షలు సోమవారం పకడ్బందీగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం, అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పది పబ్లిక్ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో విద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమై పది పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద ఇతరులను ఎవరిని అనుమతించడం లేదు. అంతేకాకుండా పరీక్ష విధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి సెల్ఫోన్లో అనుమతించడం లేదు. ఇదిలాఉంటే బనగానపల్లి తాసిల్దార్ ఆల్ఫ్రెడ్, సీఐ సుబ్బరాయుడు, ఎస్సై రామిరెడ్డి పది పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించారు.