గత రెండేళ్లుగా పడుతున్న అవస్థల నుంచి ఈ ఏడాది కాస్త మొక్కజొన్న పండిస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా నాటి పంట ఉత్పత్తులు రైతులు ఇళ్లల్లోనే మూలుగుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది పంట మార్పిడి విధానంలో భాగంగా మొక్కజొన్న పండించిన పంటకు మంచి ధర పలకడంతో రైతులు సంబరపడ్డారు. అయితే వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదు. ఫలితంగా దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి ధర ఉంది. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్ లో వరి 14, 880 హెక్టార్లలో సాధారణ సాగు విస్తీర్ణం కాగా 15684 హెక్టార్లలో మొక్కజొన్న సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఎకరా విస్తీర్ణానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 1870 ప్రకటించింది. అయితే ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా దళారులనే ఆశ్రయించాల్సి వస్తోంది.