కుమార్తె పెళ్లి చూడకముందే ఒక మహిళ హఠాత్తుగా మృతి చెందిన సంఘటన రాజాం పట్టణంలో ఆదివారం సాయంత్రం సంభవించింది.. రాజాం పట్టణంలోని అంతకాపల్లి గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంకాడ గ్రామానికి చెందిన పెంట మాను కొండమ్మ (40) మృతి చెందింది. తన కుమార్తె వివాహం నిమిత్తం శుభలేఖలు పంపిణీ చేసేందుకు కుమారుడు తో సహా బైక్ మీద వచ్చి పంపిణీ చేసిన అనంతరం, శ్రీకాకుళం వైపు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. అంతకా పల్లి గ్రామ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంటామన్న అనుమానంతో హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. కుమారుడు కు కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.