చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రాజాం సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంఘం చైర్మన్ బాబు అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాజాము కోర్టు సముదాయంలో ఆటో, కారు డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బాబు మాట్లాడుతూ కార్మికుల చట్టాలు వారి హక్కులు ప్రయోజనాల గురించి వివరించారు. కార్మికుల ద్వారా వెట్టి చాకిరీ చేయించడం నేరమని, బాల కార్మిక చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో చేర్పించడం నిషేధించినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా పిల్లలను పనిలో పెట్టుకున్న వారికి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించబడుతుందని హెచ్చరించారు. పిల్లలు తరచూ చాలా గంటలు పని చేయడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ అనారోగ్యాలకు గురవుతున్నారని వారిలో ఎదుగుదల లోపిస్తుందని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి న్యాయవాదులు, రాజాం సి. ఐ పి. శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.