నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాట్సాప్ కఠిన చర్యలు తీసుకుంటోంది. స్వీయ మెకానిజంతో పాటు ఇతరుల నుంచి వచ్చే ఫిర్యాదులపై దృష్టి సారించింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 18 లక్షల యూజర్ల ఖాతాలను బ్లాక్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషాలు కలిగే వీడియోలు, ఇతరులను కించపర్చేలా వ్యవహరించే ఖాతాలపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఇటువంటి వాటిపై నిఘా ఉంటుందని, అందుకు అనుగుణంగా
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను నిత్యం అభివృద్ధి చేస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టే కామెంట్లు చేయడం, పోస్టులు పెడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐటీ చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంకైనా 50 లక్షలకు మించి ఖాతాదారులు ఉంటే ఫిర్యాదులను స్వీకరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఉండాలని కేంద్రం నిబంధన పొందుపర్చింది. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని కూడా నిబంధనల్లో చేర్చింది. దీంతో మారిన నిబంధనల ప్రకారం నిబంధనలు పట్టించుకోని యూజర్లపై వాట్సాప్ కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చిలో 18 లక్షల యూజర్లను బ్లాక్ చేయగా, ఫిబ్రవరిలో 14.26 లక్షల యూజర్లపై నిషేధం విధించింది.