మహారాష్ట్రలోని పుణె శివారులో ఉన్న వడగావ్ అనే గ్రామానికి చెందిన 18 ఏళ్ల హర్షద శరద్ గరుడ్ ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. గ్రీస్ లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో స్నాచ్ లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలతో మొత్తం 153 కిలోల బరువులెత్తి హర్షద జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఆమె ఈ ఘనత సాధించడానికి ఆమె తండ్రి అందించిన ప్రోత్సాహమే కారణం.
హర్షద తండ్రి శరద్ వెయిట్‌లిఫ్టింగ్‌లో కోచింగ్ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి పాఠశాల పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతపతకం గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత శరద్ తండ్రి మరణించడంతో కలను పక్కనబెట్టి ఉపాధిపై దృష్టిపెట్టారు. అయితే తన పిల్లలతోనైనా తన కలను నెరవేర్చుకోవాలని శరద్ అనుకున్నారు. హర్షదను వెయిట్‌లిఫ్టర్‌ను చేయాలనుకున్నారు. హర్షద 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు 50 కేజీల బియ్యం బస్తా మోసింది. ఇది చూసి శరద్ తన కుమార్తె కచ్చితంగా గొప్ప అథ్లెట్ అవుతుందని నమ్మాడు. హర్షదకు అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఎంతో కష్టపడి ఆమెకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.
హర్షద ఎంతటి కఠినమైన సాధననైనా ఆనందంగా చేసేదని ఆమె తండ్రి శరద్ తెలిపారు. జూనియర్ స్థాయి వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు వెళ్లడానికి 2 నెలల ముందు హర్షదకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. దీంతో 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఆ కారణంగా యూనివర్శిటీ స్థాయి పోటీల్లో కూడా ఆమె పాల్గొనలేదు. దాదాపు ఒక నెల పాటు ఆమె కోచింగ్‌కు దూరంగా ఉంది. దీంతో ఆమె వరల్డ్ ఛాంపియన్ పోటీలకు వెళ్లగలదో లేదో అని ఆమె తండ్రి ఆందోళనకు గురయ్యారు. కానీ హర్షధ తన పట్టుదలతో అన్నట్లుగానే బంగారు పతకాన్ని సాధించింది. అనారోగ్యం వేధించినా తమ కుమార్తె పట్టుదలతో తన కల నెరవేర్చిందని శరద్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.