ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి. తెల్లవారుజామున పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడ్డాయి. మాచర్ల మండలం కంభంపాడులో పిడుగుపడి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొత్తూరులో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శిలో, కురిచేడులో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.బాపట్లలో కురిసన వర్షంతో శనగ రైతులు నష్టపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో భారీగా ఈదురుగాలులకు వంద ఎకరాల్లో మామిడి నేలరాలింది. లక్షలాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగు తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.