ఫేస్‌బుక్ పరిచయం ఆ యువతి జీవితాన్ని నాశనం చేసింది. పెళ్లి చేసుకుని మోసపోయిన యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. అతడికి అప్పటికే పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి నిర్ఘాంతపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం..
ఏలూరుకు చెందిన సచివాలయ ఉద్యోగినికి ఆలూరుకు చెందిన షానవాజ్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో గత ఏడాది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తాను కోచింగ్‌కు వెళ్లి చదువుకోవాలని ఆ యువతి నుంచి షానవాజ్ రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఆతర్వాత నాలుగైదు నెలల నుంచి కనిపించకుండా పోయాడు. అనంతరం వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు భరించలేక బాధిత యువతి బుధవారం ఆలూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తరువాత బాధితురాలికి అసలు విషయం తెలిసింది.
షానవాజ్‌కు ఇదివరకే వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడని, ఇలా ఆడపిల్లలను ఫేస్‌బుక్‌ల ద్వారా ట్రాప్ చేసి మోసగిస్తున్న షాన్‌వాజ్‌ను, ప్రోత్సహిస్తున్న అతని భార్యను శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో షానవాజ్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించగా అతను వచ్చీ రాగానే బాధిత యువతి అతనికి చెప్పుతో దేహశుద్ధి చేసింది. ఈ వ్యహారం నడుస్తుండగానే మరో అంశంపై తెరపైకి వచ్చింది. షానవాజ్, అతని భార్య గాయత్రి తమ వద్ద రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వడం లేదని ఆలూరు ఎన్జీవోస్ కాలనీకి చెందిన రాధమ్మ, ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు షానవాజ్, భార్య గాయత్రిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.