ఢిల్లీలోని అమర్ కాలనీలో ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా రోడ్డు మధ్యలో రెండు వాహనాలు నిలిపి ఆమెతో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. క్యాబ్ డ్రైవర్ దారి ఇవ్వాలని బాలెనో కారులోని వారిని అడిగాడు. అయితే అందులోని వ్యక్తులు క్యాబ్ డ్రైవర్ ను తిట్టారు. దీంతో ఆ మహిళ కల్పించుకుంది. దీంతో వారు ఆమెను తిట్టారు. ఆగ్రహించిన మహిళ తనను తిట్టిన వ్యక్తి చెంపపై కొట్టింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను పలుసార్లు చెంపపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. కారులోని అతడి స్నేహితుడు మహిళ వద్దకు వచ్చి ఆమె చెంపపై కొట్టాడు. దీంతో ఆ కారును ఆపేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే కారు వేగం పెంచి ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లారు. దీంతో మహిళ మోకాలికి గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఆమెకు సహాయం చేశారు.
ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫరీదాబాద్‌కు చెందిన కారు యజమాని 25 ఏళ్ల ఉదయవీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు తమ మొబైల్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.