అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షకు హాజరైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లా కుప్పందంపాళ్యంలో వెలుగుచూసింది. తీవ్ర కడుపునొప్పితో మే 2న ఆస్పత్రిలో చేరిన బాలికకు డాక్టర్లు లాపరోస్కోపీ నిర్వహించారు. ఆమె ప్రేవులకు రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు.
అయితే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు తనకు అనుమతించాలని బాలిక రిధానియా (17) డాక్టర్లను కోరింది. ఆమె కోలుకుంటుండటంతో వైద్య బృందం సాయంతో బాలికను పరీక్షా కేంద్రానికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. రిధానియా బాగా కోలుకుంటోందని, పరీక్ష రాయాలని ఉత్సాహంగా ఉండటంతో ఆమెను అన్ని జాగ్రత్తలతో పంపామని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ తెలిపారు.