ఉదయం లేవగానే కాస్త బద్దకంగా ఉంటుంది. ఈ సమయంలో త్వరగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పని.. ఉదయం ఓ మూడు నిమిషాల పనితో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అంటే మీరు నమ్ముతారా? పైగా అది బరువును అదుపులో ఉంచే.. గ్లూటన్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ అంటే అసలు వదులుతారా? అయితే ఈ రెసిపీ మీకోసమే.
ఈ మధ్య అందరూ హెల్తీగా ఉండేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. నేచురల్‌గా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డైట్ చాలా ముఖ్యం. ఎంత వ్యాయామాలు చేసినా.. డైట్ వల్లనే బరువు అదుపులో ఉంటుంది. అలాంటప్పుడు బరువును అదుపులో ఉంచే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడంలో తప్పేముంది. ఇప్పుడు మీరు తెలుసుకునే బ్రేక్‌ఫాస్ట్ సమ్మర్లో తీసుకుంటే మరీ మంచిది.
కావాల్సిన పదార్థాలు
* పెరుగు - 100 గ్రాములు
* చియా సీడ్స్ - 5 గ్రాములు
* టొమాటో - 1 చిన్నది
* కీరాదోస - 4 టేబుల్ స్పూన్స్ (ముక్కలు)
* ఉప్పు - తగినంత
* పచ్చిమిర్చి - చిన్నవి రెండు (ముక్కలు చేసుకోవాలి)
* జీలకర్ర పొడి- అర టీస్పూన్
* బాదం - 6 (నానబెట్టినవి)
* కొత్తిమీర - తగినంత
* వేయించిన పల్లీలు - 10 గ్రాములు
తయారీ విధానం
ఓ గిన్నెలో పెరుగుతీసుకుని.. బాగా కలపాలి. దానిలో ఓట్స్, చియా సీడ్స్ వేసి కలిపి మూత పెట్టాలి. ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో నాననివ్వాలి. ఉదయాన్నే దాని బయటకు తీసి.. కీరదోస, కొత్తిమీర, టమాట, సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, వేయించిన పల్లీలు, బాదం వేసి బాగా కలపాలి. అంతే మీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ.
దీనిలో మొత్తం 240 క్యాలరీలు ఉంటాయి. ప్రొటీన్ 12.4 గ్రాములు, ఫైబర్ 6.5 గ్రాములు, ఫ్యాట్ (మంచివి) 8.6 గ్రాములు, కార్బ్స్ 29 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీ డైట్లో ఈజీగా చేర్చుకోవచ్చు. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా బ్రంచ్గా లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్లో దీనిని తీసుకోవడం వల్ల శరీరం వేసవి వేడిని తగ్గిస్తుంది.