లస్సీ అంటే మజ్జిగలో పంచదారను కలపటమే కదా... ఇది అందరికి తెలిసిన విషయమే. అలా కాకుండా ఈ సారి వెరైటీగా చాకొలేట్ తో లస్సీ చేసి పిల్లలకు ఇవ్వండి. ఎప్పుడూ మజ్జిగ తాగమంటే అంతదూరం పారిపోయేవాళ్లు, మీరిచ్చిన చాకొలేట్ లస్సీ గ్లాసును ఠక్కున ఖాళీ చేసి మరొక గ్లాస్ అడుగుతారు. కావాలంటే ఈ రెసిపీని ఒకసారి చేసి చూడండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
కావాల్సిన పదార్థాలు: చాకొలేట్ సిరప్, కోకో పౌడర్, పెరుగు, పంచదార, ఐస్ క్యూబ్స్, చాకొ చిప్స్
తయారీవిధానం: చాకొలేట్ లస్సీకి ప్రధానంగా కావాల్సింది స్వచ్ఛమైన, కమ్మని పెరుగు. ఇది లేకుంటే ఈ రెసిపీని విరమించుకోవటం మంచిది. ముందుగా ఒక జ్యూసర్ ను తీసుకుని అందులో రెండు కప్పుల తియ్యటి పెరుగు, ఒక కప్పు పంచదార, నాలుగు ఐస్ క్యూబ్స్, రెండు మూతల చాకొలేట్ సిరప్, ఒక స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడొక గాజుగ్లాసును తీసుకుని దాని చుట్టూరా చాకొలేట్ సిరప్ ను రాయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోని చాకొలేట్ లస్సీ ని ఈ గ్లాస్ లో పోసుకోవాలి. ఆపై ఇంకొంచెం చాకొలేట్ సిరప్ తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. వీలుంటే కొన్ని చాకోచిప్స్ ను యాడ్ చేసుకోండి. అంతే... రెస్టారెంట్ స్టైల్ చాకొలేట్ లస్సీ రెడీ.