ఓ చిలుక ఎగిరిపోయి ఓ కుటుంభానికి పుత్రశోకం మిగిల్చింది. బీహార్ లోని ఓ కుటుంబం తమ పెంపుడు చిలుక కోసం అలమటిస్తోంది. గయ ప్రాంతంలో నివసించే శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత దంపతులు ఓ రామచిలుకను గత 12 ఏళ్లుగా ఎంతో ముచ్చటపడి పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ చిలుక అదృశ్యమైంది. ఎటు ఎగిరివెళ్లిందో తెలియక శ్యామ్ దేవ్ ప్రసాద్ కుటుంబం తీవ్ర విచారానికి గురైంది. కన్నబిడ్డలా చూసుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఆ కుటుంబం అనేక ప్రాంతాల్లో వెదికింది.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గయ పరిసర ప్రాంతాల్లో చిలుక బొమ్మతో పోస్టర్లు వేశారు. చిలుకను పట్టిస్తే రూ.5,100 నజరానా ఇస్తామని ప్రకటించారు. తమ ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు. అటు సోషల్ మీడియాలో కూడా చిలుక గురించి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ చిలుకను తీసుకెళితే దయచేసి తిరిగి ఇచ్చేయాలని శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.