భగీరథ మహర్షి పట్టుదలతో దివినుండి భువికి లోక కల్యాణం కోసం గంగ ను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అనంతపురము ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కొనియాడారు. ఆదివారం ఉదయం శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా అనంతపురము నగరము లోని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ఆర్‌టిసి బస్టాండ్ దగ్గర గల కూడలి నందు ఉన్న శ్రీ శ్రీ శ్రీ భగీరధ మహర్షి విగ్రహమునకు పూలమాలలు వేసి ఆయన చిత్రపటానికి జెడ్పి ఛైర్మన్ బోయగిరిజమ్మ, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, కొగటం విజయ భాస్కర్ రెడ్డిలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులుఅర్పించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు. ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడుగా పేరొందారన్నారు. మరుగునపడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కరువు ప్రాంతమైన రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావడం కోసం జలయజ్ఞం ద్వారా భగీరథ ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆయన తనయుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. సీమకు సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. సగర కులస్తులు సమైక్యంగా ఉంటూ చైతన్య వంతులు కావాలని, అప్పుడే ఆర్థికంగా, సామాజికంగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ప్రగతికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు పెద్దపీట వేశామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ ఆర్. హరిత, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ అన్న పూర్ణ, కార్పొరేటర్ సుజాతమ్మ, బిసి జేఏసీ నాయకులు రమేష్ గౌడ్, సగర ఉప్పర రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా నాయకులు రామచంద్ర, రామాంజనేయులు, జోగి రాజేంద్ర తిరుపతయ్య, రాజేష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిడి ఖుష్బూ, ఆ శాఖకు చెందిన అధికారులు మరియు సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.