మహారాష్ట్ర పోలీసులపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు తనతోను, తన భర్త రవి రాణాతోనూ అమర్యాదగా ప్రవర్తించారని, నేరస్థుల కంటే హీనంగా చూశారని పేర్కొంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించి కలకలం రేపిన రాణా దంపతులను గత నెల 23న అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవలే వారు బెయిలుపై విడుదలయ్యారు.
నిన్న స్పీకర్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమైన రాణా దంపతులు.. మహారాష్ట్ర పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం నవనీత్ రాణా విలేకరులతో మాట్లాడుతూ.. తన ఫిర్యాదును ఈ నెల 23న లోక్‌సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. తాను లిఖితపూర్వక స్టేట్‌మెంట్ ఇస్తానని తెలిపారు.
తమ అరెస్ట్, తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేస్తామని రాణా దంపతులు తెలిపారు. మరోవైపు, రాణా దంపతుల అరెస్ట్‌పై వాస్తవాలు పంపాలంటూ లోక్‌సభ కార్యాలయం కేంద్ర హోంశాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.