ఏపీలో చీరాల, బాపట్ల మధ్య అసని తుఫాన్ తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన తర్వాత తుఫాన్ కాకినాడ, విశాఖ వైపు మళ్లింది. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడింది. మచిలీపట్నానికి 60 కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయంగా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం వాయుగుండంగా బలహీనపడనుంది. మచిలీపట్నం, నర్సీపట్నం, యానాం, కాకినాడ, విశాఖ మీదుగా తుఫాన్ పయనించే అవకాశం ఉంది.
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, యానాం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 75-95 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రకాశం జిల్లా సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. తుఫాన్ కారణంగా విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి బయలుదేరే విమానాలను రద్దు చేశారు. నిజాంపట్నం హార్బర్ లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతో పాటు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్‌ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్‌ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల్ని పంపించారు.
మచిలీపట్నం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257
మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486
కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100
ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077
ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1077
విద్యుత్ స్తంభాలు ఒరిగితే తెలియజేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1912
విద్యుత్ సమస్యలపై సంప్రదించాల్సిన నంబర్ 9493 178718
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నంబర్ 90103 13920
పెద్దాపురం ఆర్డీవో కంట్రోల్ రూం నంబర్ 960366332
గుంటూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 0863-2234014
విశాఖ కంట్రోల్ రూమ్ నంబర్ - 08912869106