ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీ పదవి నుంచి ముకుల్ గోయెల్‌ను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బుధవారం సీఎంఓ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పనిపై ఆసక్తి చూపడం లేదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని ముకుల్ గోయల్‌పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ పదవి నుంచి ఆయనను తప్పించి ప్రాధాన్యత లేని సివిల్ డిఫెన్స్ డీజీగా ఆయనను బదిలీ చేశారు. డీజీపీగా ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ముకుల్ గోయల్ పనితీరుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసంతృప్తిగా ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రితో జరిగిన కీలక సమావేశంలో డీజీపీ పాల్గొనలేదు. దీంతో అప్పటి నుంచే ఏదో జరుగుతోందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ముకుల్ గోయెల్ జూలై 2021లో యూపీ డీజీపీగా ఎంపికయ్యారు. ఆయన అంతకు ముందు అల్మోరా, జలౌన్, మైన్‌పురి, హత్రాస్, అజంగఢ్, గోరఖ్‌పూర్, వారణాసి, సహరాన్‌పూర్, మీరట్ జిల్లాలలో ఎస్పీగా, ఎస్‌ఎస్‌పీగా బాధ్యతలు నిర్వహించారు. ఐటీబీపీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో కూడా ఆయన పని చేశారు.