చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.74 మేర ధర పెరగడం చూసి, సామాన్యులు గుండె గుభేల్‌మంటోంది. బాయిలర్ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.312కు చొప్పున ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. లైవ్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.166 పలుకుతోంది. దీంతో చికెన్ కొనాలంటేనే అంతా కళ్లు తేలేసే పరిస్థితి నెలకొంది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. ఆ సమయంలో చికెన్ తినేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఒకానొక దశలో కిలో చికెన్ ధర రూ.80కి పడిపోయింది. అనంతరం క్రమంగా పెరిగి రూ.280కు చేరింది. ఈ ఏడాది తొలి నుంచి రూ.200 కంటే ధర తగ్గింది లేదు. రూ.200లపైనే స్థిరంగా ధర కొనసాగుతోంది. అయితే కేవలం 10 రోజుల వ్యవధిలోనే అమాంతంగా ధర పెరగడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఈ ఏడాది మే 1న కిలో చికెన్ ధర రూ.228గా ఉండగా, మే 2 నాటికి రూ.238, మే 3 నాటికి రూ.248, మే 5 నాటికి రూ.260, మే 6న రూ.266, మే 7న రూ.272, మే 8న రూ.288, మే 9న రూ.294, మే 10న 300, మే 11 నాటికి రూ.306, మే 12 నాటికి రూ.312కు చేరింది. వేసవి కాలంలో ఫారాలలో కోళ్ల పెరుగుదలకు సమయం పడుతుంది. దీంతో మార్కెట్‌లో కోళ్ల లభ్యత తక్కువగా ఉంటుంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టు కోళ్ల సప్లయి లేకపోవడంతో ధరల పెరుగుదల ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.