ఒక అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్ తో పాటు ఇద్దరు నాటుసారా విక్రయించే వారిపైనా పీడీయాక్ట్ నమోదు చేశామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలి పిన వివరాల మేరకు. బెంగళూరు సిటీ కటిగనహల్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగర్ అతహుల్లాఖాన్ అలియాస్ ఆక్రమ్ అలియాస్ అతుల్ నాలుగు సంవత్సరాల నుంచి ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. జిల్లాలో ఇప్పటివరకు ఇతనిపై 11 కేసులు ఉన్నాయి. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి బాలుపల్లి, అట్లూరు, గువ్వలచెరువు, సుండుపల్లి ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి అక్రమంగా రవాణా చేసేవాడు. ఇతనిపై పీడీ యాక్ట్ నివేదిక తయారు చేసి కలెక్టర్ విజయరామరాజుకు పంపించగా ఆయన ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సెంట్రల్ జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ప్రకాష్ కు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు.
మైదుకూరు మండలం వనిపెంట గ్రామానీకి చెందిన ఎన్. కల్యాణకుమార్, పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన పాలర్ల చిన్న గంగరాజు నాటు సారా తయారు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వద్ద నుంచి వందలాది లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న వీరిపై జిల్లా వ్యాప్తంగా 7 కేసులు ఉన్నాయి. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ నివేదికను కలెక్టర్ కు సమర్పించడంతో ఆయన ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరిని కడప కేంద్ర కారాగా దానికి తరలించామని ఎస్పీ తెలిపారు.