శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చేపట్టిన పరిశోధనలు విజయవంతం అయ్యాయనే చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా చంద్రుడిపై మట్టిలో ఏదైనా విషయం ఉందా అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపడుతున్నారు. పరిశోధనలలో భాగంగా ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రుడి మట్టి (లూనార్ సాయిల్)లో తొలిసారిగా శాస్త్రవేత్తలు మొక్కలను మొలిపించగలిగారు. తాజా ప్రయోగంలో కేవలం 12 గ్రాముల ల్యూనార్ సాయిల్‌ను వాడారు.
చేతి వేలు పట్టేంత పరిమాణం గల చిన్నపాటి ట్యూబ్స్ లో ల్యూనార్ సాయిల్ (రిగొలిత్)ను వేసి అందులో విత్తనాలు పెట్టారు. ప్రతి రోజూ న్యూట్రియెంట్ సొల్యూషన్‌ను అందిస్తూ మొక్కలను మొలిపించి విజయం సాధించారు. చంద్రుడి మట్టిలో మొదటిసారి మొలిచిన మొక్కలు ఆవాలు తరహాలో ఉండే కాలిఫ్లవర్ జాతికి చెందినవిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ విషయాలకు సంబంధించిన వివరాలను ‘కమ్యూనికేషన్స్ బయాలజీ’అనే జర్నల్ ప్రచురించింది.