త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఎన్నుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మారుస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాలతో సీఎం పదవికి విప్లవ్ దేవ్ శర్మ శనివారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ త్రిపుర చీఫ్, రాజ్యసభ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. బీజేపీ త్రిపుర అధ్యక్షుడిగా విప్లవ్ కుమార్ దేవ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవికి మాణిక్ సాహా పేరును విప్లవ్ కుమార్ దేవ్ స్వయంగా ప్రతిపాదించినట్లు తెలిసింది.
మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ త్రిపుర అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. నవంబర్ 2021లో త్రిపురలో జరిగిన ఎన్నికలలో మొత్తం బీజేపీ విజయానికి మాణిక్ సాహా కృషి చేశారు. మాణిక్ సాహా వృత్తిరీత్యా దంతవైద్యుడు. సీఎంగా ఆయన ఎన్నిక తర్వాత కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "త్రిపుర బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైనందుకు మాణిక్ సాహా గారికి చాలా అభినందనలు. గౌరవనీయమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వం, నాయకత్వంలో త్రిపుర అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని నేను భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.