బీజేపి నాయకులపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే విరుచుకుపడ్డారు. తమ పార్టీని బీజేపీ నేతలు గాడిదలతో పోల్చడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీతో పొత్తును తెంచుకున్నప్పుడు శివసేన 'గాడిదలను' తరిమికొట్టిందని అన్నారు. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాము గాడిదలమని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారన్నారు. అయితే తాను బీజేపీతో పొత్తును తెంచుకున్నప్పుడు గాడిదలను తరిమికొట్టామన్నారు. కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో ఉగ్రవాదులు చంపారన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఏం చేస్తారని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి, హనుమాన్ చాలీసా చదువుతారా అని నిలదీశారు.
కొందరు నకిలీ హిందుత్వవాదులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఉద్ధవ్ థాకరే అన్నారు. దేవాలయాల్లో గంటలు మోగించే హిందువులు తమకు అవసరం లేదని బాలాసాహెబ్ థాకరే బోధించినట్లు గుర్తు చేవారు. ఉగ్రవాదులను మట్టుబెట్టగల హిందువులు కావాలని ఉద్ధవ్ థాకరే అన్నారు.