ఏదైనా నేరం చేసి పోలీసులకు చిక్కితే వారిచ్చే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైకి దెబ్బలు కనిపించకుండా బెండు తీస్తారు. అదే పోలీసులకు మాత్రం కొందరు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. ఒళ్లంతా హూనం అయ్యేలా కొట్టారు. రాత్రివేళ తనిఖీలకు వచ్చిన వారిని, దొంగలుగా భావించి చుట్టుముట్టి చితక్కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా మచ్‌కుండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా పెరుగుతోంది. ఈ తరుణంలో గంజాయి అక్రమ రవాణాపై దీంతో పొరుగున ఉన్న మల్కన్‌గిరి జిల్లా పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో వారంతా సివిల్ డ్రెస్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు రాత్రి వేళ పయనమయ్యారు. 40 మంది పోలీసులు అర్ధరాత్రి వేళ మతిఖల్ అనే గ్రామంలో సోదాలు చేపట్టారు.
అయితే వేళ కాని వేళలో వచ్చిన ఆ పోలీసులను గ్రామస్తులంతా దొంగలుగా భావించారు. చేతికి అందిన కర్రలు, రాళ్లు తీసుకుని దారుణంగా కొట్టారు. గ్రామస్తుల దెబ్బలతో పోలీసులు ప్రాణాల కోసం పరుగు లంకించుకున్నారు. పొరుగు జిల్లా పోలీసులు తమ పరిధిలో తనిఖీలకు వెళ్లి, దెబ్బలు తిన్నారని మచ్‌కుండ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో స్థానికు పోలీసులు అక్కడకు వెళ్లి గ్రామస్తులను అదుపు చేశారు. గాయపడిన పోలీసులన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దెబ్బలు తిన్న పోలీసుల వాదన మరోలా ఉంది. తాము 150 కిలోల గంజాయి పట్టుకున్నామని, గంజాయి ముఠాతో సంబంధం ఉన్న కారణంగానే గ్రామస్తులు తమపై దాడి చేశారని చెబుతున్నారు.