పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రధాని షెహబాజ్ ప్రభుత్వాన్ని దొంగలతో పోల్చారు. దేశాన్ని దొంగలకు అప్పగించడం కంటే అణుబాంబులు వేయడం బాగుంటుందని వ్యాఖ్యానించారు. వారు అవినీతిలో కూరుకుపోయారని, అలాంటిది వారే అధికారం చేపట్టడం తనకు షాక్ ఇచ్చిందన్నారు.
అయితే ఇప్పుడు వారిపై కేసులు ఏ అధికారి విచారించగలడని ప్రశ్నించారు. ఇతరులపై ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు మాని, పాలనను చక్కదిద్దాలని హితవు పలికారు. ఇక ప్రధాని షెహబాజ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 'దిగుమతి ప్రభుత్వం'గా ఆయన అభివర్ణించారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ హోదాలో ఇస్లామాబాద్ నగరంలో ఈ నెల 20న లాంగ్ మార్చ్ చేపట్టనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా 20 లక్షల మందితో ఈ మార్చ్ చేపడుతున్నట్లు వివరించారు. తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తనను 11 పార్టీలు ఏకమై గద్దె దించాయని, అయితే ప్రజల మద్దతు తనకే ఉందని అన్నారు. ఇక పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చరిత్రలోనే తొలిసారి అత్యంత అల్ప స్థాయికి పాకిస్థాన్ కరెన్సీ పడిపోయింది. పాకిస్తాన్ కరెన్సీలో డాలరు విలువ శనివారం రూ.193 పలికింది.